- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణ
- జీవో ఎంఎస్ నంబర్–4 ద్వారా ఉత్తర్వులు
- మండల నోడల్ అధికారులైన ఎంపీడీవోలకు ప్రత్యేక శిక్షణ
- అధికారులందరూ హాజరు కావాలని ప్రభుత్వ ఆదేశం
ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ/ కరీంనగర్, ఆగస్టు 16: మండల స్థాయిలో ఇక ప్రతి సోమవారం ప్రజావాణి
ప్రజల సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్–4 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా లేదా ఇతర స్థాయి కార్యాలయాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే మండల స్థాయిలోనే క్రమం తప్పకుండా ప్రజావాణి నిర్వహించడం ద్వారా స్థానికంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడనుంది.
- మండల స్థాయిలో ‘ప్రజావాణి’ కార్యక్రమం
ప్రజల సమస్యల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరిస్తూ ఉత్తర్వులు (G.O.Ms.No.4, తేదీ: 04.08.2026) జారీ చేసింది. ప్రతి వారం సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ (MPDO) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. అధికారుల హాజరు: తహసీల్దార్, ఎంపీఓ, మండల వ్యవసాయ అధికారి, ఎంఈఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి, పోలీస్ మరియు ఇతర మండల స్థాయి శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వెంటనే చర్యలు చేపడతారు.డిజిటల్ నమోదు మండల స్థాయిలో వచ్చే ప్రతి ఫిర్యాదును ఏకీకృత ‘ప్రజావాణి పోర్టల్’లో నమోదు చేసి, ఫిర్యాదుదారునికి గ్రీవెన్స్ ఐడీ తో కూడిన రసీదును అందిస్తారు. ప్రాధాన్యత & సౌకర్యాలు: వికలాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు, బాలింతలకు అర్జీల సమర్పణలో మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మంచినీరు, కూర్చోవడానికి సీటింగ్, హెల్ప్‌డెస్క్ వంటి ప్రాథమిక సౌకర్యాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేస్తారు. ప్రజా సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
- ఎంపీడీవోలకు ప్రత్యేక శిక్షణ
మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మండల నోడల్ అధికారులైన ఎంపీడీవోలకు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రజావాణి నిర్వహణ విధానం, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల స్వీకరణ, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పించారు
- ప్రజల సమస్యలకు ప్రాధాన్యం
ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు తమ సమస్యలను అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లే అవకాశం మరింత సులభతరం కానుంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలు, స్థానిక పరిపాలనకు సంబంధించిన అంశాలు, ప్రజా సేవలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు.మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా నిర్వహించి, ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు నేటి నుంచి (ఆగస్టు 17 సోమవారం ) మండల ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు సమర్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు సూచించారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహిస్తున్నందున, తమ సమస్యలు, వినతులు సమర్పించేందుకు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రజలు తమ దరఖాస్తులను మండల స్థాయిలోనే అందజేయాలి: కరీంనగర్ కలెక్టర్
ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి పరిష్కరించే లక్ష్యంతో ఆగస్టు 17వ తేదీ నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మండల ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహిస్తున్నందున, తమ సమస్యలు, వినతులు సమర్పించేందుకు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.మండల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కోరారు.





























