ప్రతిపక్షం, ఆగస్టు 18: హైదరాబాద్ నగర పరిధిలో పోక్సో, లైంగికదాడి కేసులకు సంబంధించిన గణాంకాలను పోలీసులు వెల్లడించారు. 2024, 2025 సంవత్సరాల్లో నమోదైన కేసులను పరిశీలించగా మూడు కమిషనరేట్లలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసులు 2024లో 681 నమోదుకాగా, 2025లో 568కి తగ్గాయి. లైంగికదాడి కేసులు కూడా 584 నుంచి 405కు తగ్గినట్లు పోలీసులు తెలిపారు.
అయితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసులు పెరిగాయి. 2024లో 350 కేసులు నమోదుకాగా, 2025లో ఈ సంఖ్య 510కి చేరింది. రాచకొండ కమిషనరేట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ పోక్సో కేసులు 392 నుంచి 516కి పెరిగాయి.
ఇక ప్రస్తుత ఏడాదిలో ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో గడిచిన ఏడు నెలల్లో సుమారు 1,200 పోక్సో, అత్యాచార కేసులు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బాలికలు, మహిళలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది.
పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనుమానాస్పద పరిస్థితులు లేదా వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.





























