ప్రతిపక్షం, ఆగస్టు 09: తెలంగాణ రాజకీయాల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్రంగా చేసుకుని మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భాగ్యలక్ష్మి అమ్మవారిని అవహేళన చేసిన కేటీఆర్.. ఇప్పుడు అదే ఆలయానికి ముందుగానే వచ్చి మొక్కుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో తాను ఆలయానికి వస్తే హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టించేందుకు వెళ్తున్నానంటూ కేటీఆర్ విమర్శలు చేశారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అమ్మవారి ప్రభావం ఏంటో కేటీఆర్‌కు తెలిసొచ్చిందని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ ముందుగానే ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుకున్నారని బండి సంజయ్ అన్నారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారని ప్రస్తావించారు. అమ్మవారే వారిని ఆలయానికి రప్పించారని వ్యాఖ్యానించారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాజకీయ వివాదాలకు కేంద్రంగా మార్చడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ.. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.





























