ప్రతిపక్షం, ఆగస్టు 10: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై మరోసారి దర్యాప్తు చేపట్టాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశించారు. బాధితురాలి తల్లి, ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
ఈ కేసు దర్యాప్తు సమయంలో పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పలు అంశాలను మరోసారి పరిశీలించి, దర్యాప్తులో ఏమైనా లోపాలు జరిగాయా అనే విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ముఖ్యంగా బాధితురాలి అంత్యక్రియల నిర్వహణపై గతంలో వచ్చిన ఆరోపణలపైనా ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని సీఎం సూచించారు. అంత్యక్రియల సమయంలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు నిజమని తేలితే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్జీ కర్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన విషయం తెలిసిందే. వైద్యులు, విద్యార్థులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. కేసు దర్యాప్తు, ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరు, పోలీసుల చర్యలపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు మరోసారి దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసులో కొత్తగా ఏ అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.





























