ప్రతిపక్షం, ఆగస్టు 10: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నూతన ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అదే సమయంలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయానికి నూతన భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, మెరుగ్గా అందేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎల్కతుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.
నియోజకవర్గంలో సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రభుత్వ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు చదువే పునాది అని, ప్రతి విద్యార్థి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.



చదువుతో పాటు విద్యార్థులకు వృత్తిపరమైన, నైపుణ్య ఆధారిత శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. ఎల్కతుర్తి పాఠశాల నుంచి విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, నైపుణ్యాలు, ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనబరచి ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు.
నూతన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనం అందుబాటులోకి రావడంతో బాలికలకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వసతులను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ఎల్కతుర్తి మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.





























