ప్రతిపక్షం, ఆగస్టు 11: తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో దాదాపు 73 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. మృతులు, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు, గణన పత్రాలు సమర్పించని వారి పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అందులో తమ పేరు లేకపోతే సంబంధిత ఓటర్లు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. తమ ఓటు హక్కును కొనసాగించుకోవాలంటే నిర్ణీత ప్రక్రియ ప్రకారం అవసరమైన వివరాలు, పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
మరోవైపు 2002లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో వివరాలు సక్రమంగా నమోదు కాని వారిలో సుమారు 20 శాతం మందికి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంబంధిత ఓటర్లు తమ గుర్తింపును నిర్ధారించేందుకు ప్రభుత్వం ఆమోదించిన గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటూనే.. మృతులు, ద్వంద్వ ఓట్లు, ఇతర కారణాలతో అనర్హమైన పేర్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఓటర్లు తమ పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం కీలకంగా మారనుంది.





























