ప్రతిపక్షం, ఆగస్టు 13, హైదరాబాద్: మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని పూర్తిగా వసూలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ప్రతి ధాన్యం గింజకు సంబంధించిన బకాయి ప్రభుత్వానికి తిరిగి రావాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సహకరించే వారితో సానుకూలంగా వ్యవహరిస్తామని, ఉద్దేశపూర్వకంగా బకాయిలను ఎగవేసేందుకు ప్రయత్నించే వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిల వసూలు, ధాన్యం నిల్వకు అవసరమైన మౌలిక వసతులు, రానున్న సీజన్‌లో ఎదురయ్యే సమస్యలు, ప్రత్యామ్నాయ నిల్వ ఏర్పాట్లపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.
గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం కల్పించి, ప్రస్తుతం ఆ తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే బకాయిల వసూళ్లలో కొంత పురోగతి సాధించామని అధికారులు వివరించగా.. బకాయిల వసూలు విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రతి ధాన్యం గింజకు సంబంధించిన బకాయిని లెక్కించి, మిల్లర్ల నుంచి వసూలు చేసే విధంగా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బకాయిల వసూలు కోసం రూపొందించే విధివిధానాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించాలని సూచించారు. ఉపసంఘం నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లకు ఇకపై ధాన్యం కేటాయింపుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. అలాంటి మిల్లర్లకు కేటాయించాల్సిన ధాన్యాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించి, మిల్లింగ్ బాధ్యతలను వారికి అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు ధాన్యం మిల్లింగ్ వ్యవస్థలోనూ వారి భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం నిల్వకు ముందస్తు కార్యాచరణ
ప్రతి ధాన్యం సీజన్‌లో నిల్వ సామర్థ్యం కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ధాన్యం భారీగా వచ్చే నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్‌ల ద్వారా ధాన్యం నిల్వ చేసే విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సైలో బ్యాగ్ నిల్వ కేంద్రాల ఏర్పాటుకు నియోజకవర్గానికి సుమారు 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి రెవెన్యూ, పౌర సరఫరాలు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ప్రత్యామ్నాయ నిల్వ కేంద్రాలపై దృష్టి
ధాన్యం నిల్వకు అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాలమైన ప్లాట్‌ఫామ్‌లను నిర్మించి జర్మన్ టెంట్ల వంటి తాత్కాలిక ఏర్పాట్లతో ధాన్యం నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ధాన్యం వచ్చిన సమయంలో నిల్వ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అదేవిధంగా మండల, గ్రామ స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రైవేటు గోదాములను ముందుగానే గుర్తించాలని సీఎం సూచించారు. ధాన్యం నిల్వకు అనుకూలంగా ఉండే కల్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర పెద్ద షెడ్లను కూడా గుర్తించి అవసరమైన సమయంలో లీజుకు తీసుకునే విధంగా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత హడావుడిగా నిల్వ కేంద్రాల కోసం వెతకకుండా.. ఇప్పటి నుంచే అందుబాటులో ఉన్న భవనాలు, గోదాములు, ఖాళీ స్థలాలు, ప్రత్యామ్నాయ నిల్వ పద్ధతులపై జిల్లాల వారీగా పూర్తి వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం నిల్వలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన వ్యవస్థను సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షలో సీఎం ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, పౌర సరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సౌత్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






























