ప్రతిపక్షం, ఆగస్టు 13: బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద మొబైల్ ఫోన్ లభించిన ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఫోన్‌ను పరిశీలించగా అందులో సుమారు 80 నుంచి 90 వరకు అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వీటిలో ఎక్కువగా భారతీయులకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అలాగే మహిళలకు సంబంధించిన అభ్యంతరకర చిత్రాలతో కూడిన కొన్ని పత్రాలు, పత్రికా కత్తిరింపులు కూడా ఫోన్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. జైలులోకి నిషేధిత వస్తువు అయిన మొబైల్ ఫోన్ ఎలా చేరిందన్న అంశంపైనా అధికారులు విచారణ చేపట్టారు.
మహిళపై అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. జైలు నిబంధనలను ఉల్లంఘించి మొబైల్ ఫోన్ వినియోగించిన వ్యవహారంపై అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.





























