ప్రతిపక్షం, ఆగస్టు 14: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు–2027 కోసం టీజీఎస్ఆర్టీసీ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఉపసంఘం సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లు, భక్తుల రవాణా సౌకర్యాలపై సమీక్షించారు. సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పుష్కరాల సందర్భంగా పాత ఐదు జిల్లాల పరిధిలోని 85 పుష్కర ఘాట్లు, వాటికి సమీపంలోని 22 ఆర్టీసీ బస్స్టేషన్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్స్టేషన్లలో భవనాలు, ప్లాట్‌ఫారాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రోడ్లు, ఇతర ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచనున్నారు.
ఒక్కో బస్‌స్టేషన్ అభివృద్ధికి సుమారు రూ.3 కోట్లు చొప్పున 22 బస్స్టేషన్లకు రూ.66 కోట్లు అవసరమని అంచనా వేశారు. అదనంగా పుష్కరాల సమయంలో తాత్కాలిక బస్షెల్టర్లు, వేచి ఉండే ప్రాంతాలు, పార్కింగ్ సదుపాయాల కోసం మరో రూ.22 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. దీంతో ఆర్టీసీ మౌలిక వసతుల కోసం మొత్తం రూ.88 కోట్లు అవసరమవుతాయని అంచనా.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గత పుష్కరాలతో పోలిస్తే సుమారు 30 శాతం అదనంగా బస్సులు నడపాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. ఘాట్ల వారీగా ప్రయాణికుల రాకపోకలను అంచనా వేసి ఘాట్లు–బస్స్టేషన్ల మధ్య అనుసంధానాన్ని పెంచనున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ, షటిల్ బస్సులు, పార్కింగ్ ప్రాంతాలు, తాత్కాలిక బస్షెల్టర్లను ఏర్పాటు చేయనున్నారు.
భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్లు, బస్స్టేషన్లు, వాటి మధ్య దూరాలు, రహదారులు, రవాణా అనుసంధానంతో కూడిన సమగ్ర మార్గపటాన్ని కూడా రూపొందించనున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి వచ్చే భక్తులకు కూడా ప్రజా రవాణాలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
కరీంనగర్ ప్రాంతంలో ధర్మపురి, ఎర్దండి, కాళేశ్వరం, వాల్గొండ ప్రధాన ఘాట్లుగా గుర్తించారు. ధర్మపురి, కాళేశ్వరానికి అధిక సంఖ్యలో బస్సులు, ప్రయాణ సర్వీసులు నడపాలని ప్రణాళిక రూపొందించారు.
నిజామాబాద్ ప్రాంతంలో పోచంపాడ్, కందకుర్తి, తడపాకల, దొంచంద, గుమిర్యాల్, సావేల్, తుంగిని, ఉమ్మెడ, బాసర తదితర ఘాట్లను గుర్తించారు. పోచంపాడ్, కందకుర్తి, దొంచంద, తాడ్‌బిలోలి ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ దీపాలు, బెంచీలు, టెంట్లు ఏర్పాటు చేయనున్నారు.
ఆదిలాబాద్ ప్రాంతంలో బాసర, ముధోల్, నిర్మల్, ఖానాపూర్, మంచిర్యాల, జెన్నారం, లక్సెట్టిపేట తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నారు. బాసర పుణ్యక్షేత్రానికి హైదరాబాద్, సికింద్రాబాద్, భైంసా డిపోల నుంచి అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులు కేటాయించాలని ప్రతిపాదించారు.
వరంగల్ ప్రాంతంలో కాళేశ్వరం, రామన్నగూడెం, మంగపేట, ముళ్లకట్టు ప్రధాన ఘాట్లుగా ఉన్నాయి. కాళేశ్వరం వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బస్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.
ఖమ్మం ప్రాంతంలో భద్రాచలం, పమాశాల, రామానుజవరం, చినరావిగూడెం, మోతేగడ్డ, దుమ్ముగూడెం, ఏటపాక, కొత్తగూడెం తదితర ఘాట్లకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాలకు మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం డిపోల నుంచి విస్తృతంగా బస్సులు నడపాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
ఘాట్ల వద్ద తాగునీరు, టెంట్లు, విశ్రాంతి బెంచీలు, హైమాస్ట్ లైట్లు, తాత్కాలిక బస్ టెర్మినల్స్, ప్రయాణికుల హోల్డింగ్ ప్రాంతాలు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు, రిస్క్ టీమ్‌లు, హైడ్రా తదితర విభాగాలతో సమన్వయం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ముందుగానే రవాణా వ్యవస్థను సిద్ధం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.































