[t4b-ticker]

కాంగ్రెస్‌లో బయటివారి పెత్తనం ఎక్కువైందన్నదే నా ఉద్దేశం: రాజ్‌గోపాల్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 14, యాదాద్రి: కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం పెరిగిందని మాత్రమే తాను వ్యాఖ్యానించానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీపై విమర్శలుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన తేల్చిచెప్పారు.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్‌లోని నిజమైన నాయకులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడా కాంగ్రెస్ నాయకులను విమర్శించలేదని, ఇకపై కూడా విమర్శించబోనని స్పష్టం చేశారు.

ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలి

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో తగిన గుర్తింపు కల్పించాలని రాజ్‌గోపాల్ రెడ్డి కోరారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టకుండా వారి సేవలను గుర్తించాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజల కోసం పాలన ఉండాలి

సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వం నడవకూడదని రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాపాలన అంటే పేదల కోసం పనిచేయడమేనని అన్నారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు లేదా ఇతర వర్గాల ప్రయోజనాల కంటే తెలంగాణ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల ఉద్దేశం పార్టీని బలహీనపరచడం కాదని, కాంగ్రెస్‌లోని నిజమైన నాయకులు, ఉద్యమకారులకు న్యాయం జరగాలన్నదేనని రాజ్‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News