[t4b-ticker]

తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 15: తెలంగాణ పునర్నిర్మాణానికి గత రెండున్నరేళ్ల ప్రజా పాలనలో బలమైన పునాదులు వేశామని, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు, ఉద్యోగులు, అధికారులు అందించిన సహకారం కీలకమని పేర్కొంటూ.. భవిష్యత్తులోనూ అందరి సహకారంతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ప్రజా ప్రభుత్వం గడిచిన 32 నెలల్లో సంక్షేమంతో నాలుగు కోట్ల మంది ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసిందని సీఎం తెలిపారు. సామాజిక న్యాయం, వ్యవసాయం, విద్య, వైద్యం, ఉద్యోగాలు, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. సాధించిన విజయాల పునాదులపై తెలంగాణను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడమే ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యమని స్పష్టం చేశారు.

తలసరి ఆదాయంలో తెలంగాణకు ముందంజ

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931గా ఉందని తెలిపారు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటిచెప్పే ముఖ్యమైన విజయమని పేర్కొన్నారు.

సంక్షేమాన్ని కేవలం ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బుతో లెక్కించబోమని సీఎం అన్నారు. పేదల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఆత్మగౌరవం తీసుకురావడమే ప్రభుత్వ సంక్షేమ విధానాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రతి పథకం వెనుక మానవీయతతో పాటు శాస్త్రీయ దృక్పథం ఉంటుందని చెప్పారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని సీఎం తెలిపారు. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ పంజాబ్‌ను అధిగమించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. తుమ్మడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని సీఎం ప్రకటించారు. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సంక్షేమ పథకాల్లో సన్నబియ్యం పథకం ఒక విప్లవాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన ఆహారం, ఆరోగ్య భద్రత కల్పించడమే దీని ఉద్దేశమని చెప్పారు.

రాష్ట్రంలో 93 లక్షలకు పైగా కుటుంబాలు, దాదాపు 3.38 కోట్ల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందని, 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తున్నామని, కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతున్నామని వివరించారు.

పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు

పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని సీఎం తెలిపారు. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు సహా 43 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని వెల్లడించారు.

కార్మికులకు ప్రయోజనం

12 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను తమ ప్రభుత్వం ఆమోదించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా సుమారు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలిగిందన్నారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు.

విద్య, ఉద్యోగ రంగాల్లో సంస్కరణలు

విద్యారంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పనితీరు సూచీలో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందని తెలిపారు.

యువతకు ఉద్యోగాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యతల్లో ఒకటని చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో 72 వేలకు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, మెగా డీఎస్సీ నియామకాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.

కేవలం నోటిఫికేషన్లు ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు, ఫలితాలు, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని సీఎం అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 456 వివిధ పోస్టులు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని వెల్లడించారు.

వైద్య రంగంలో భారీ మార్పులు

ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. గోషామహల్‌లో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్‌లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించామని, మరో 8 వైద్య కళాశాలలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. 16 కొత్త నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

డ్రగ్స్, ఆహార కల్తీపై కఠిన చర్యలు

డ్రగ్స్, ఆహార కల్తీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని సీఎం అన్నారు. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు ‘టీజీ సేఫ్’ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రత్యేక న్యాయ, ప్రయోగశాల, అమలు విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహించి కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మండల స్థాయిలో ప్రజావాణి

ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో ప్రజావాణి ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించి, ప్రజలు ఎక్కడి నుంచైనా తమ అర్జీలను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం

తెలంగాణ పోటీ ఇతర రాష్ట్రాలతో కాదని, ప్రపంచంతో పోటీ పడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక వసతుల నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభించామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్లో తెలంగాణపై నమ్మకం పెరిగిందన్నారు.

బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్‌లో వ్యాపార ప్రారంభం, నిర్మాణ అనుమతులు, సేవల రంగం, భూ పరిపాలన విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్‌గా నిలవడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెబుతామని వెల్లడించారు.

ఐటీ రంగంలో భారీ వృద్ధి

తెలంగాణ ఐటీ రంగంలో వేగంగా దూసుకెళ్తోందని సీఎం తెలిపారు. 2025-26లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరుకున్నాయని చెప్పారు. ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాల సంఖ్య 12.14 లక్షలకు పెరిగిందని వెల్లడించారు. హైదరాబాద్‌లో 355కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ కేంద్రాలు పనిచేస్తున్నాయని, 2026లో కొత్తగా 40 కేంద్రాలు హైదరాబాద్‌కు వచ్చాయని తెలిపారు.

డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ రంగాల్లో తెలంగాణ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారిందని సీఎం అన్నారు. అమెజాన్ తెలంగాణలో అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వెల్లి ప్రాంతాల్లో భారీ స్థాయి హైపర్‌స్కేల్, కృత్రిమ మేధ ఆధారిత క్లౌడ్ మౌలిక వసతులు రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.

హైదరాబాద్‌కు కొత్త రూపు

భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులు హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం, కష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు.

ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు, అధికారులు అందరి భాగస్వామ్యంతో తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.

“భగవంతుడి ఆశీస్సులతో పాటు మీ అందరి సహకారం ఉంటే మరిన్ని విజయాలు సాధిస్తాం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News