ప్రతిపక్షం, ఆగస్టు 15, హైదరాబాద్: బ్రిటిష్ పాలనలో జరిగిన దోపిడీ, అన్యాయాలు, అణచివేత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మన చరిత్రను తెలుసుకున్నప్పుడే మెరుగైన భవిష్యత్తును నిర్మించగలమని పేర్కొన్నారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను భావితరాలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
బ్రిటిష్ పాలనలో భారతదేశంపై జరిగిన దోపిడీ, అణచివేతను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. జలియన్‌వాలాబాగ్ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, కృత్రిమ కరువుల కారణంగా వేలాది మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో భారతీయులను సైనికులుగా ఉపయోగించుకుని ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నారని విమర్శించారు.
ప్రపంచ యుద్ధాల్లో పాల్గొంటే స్వాతంత్య్రం ఇస్తామని బ్రిటిష్ పాలకులు హామీ ఇచ్చినా ఆ మాటను నిలబెట్టుకోలేదని కవిత ఆరోపించారు. బ్రిటిష్ పాలనలో సామాజిక విభజనలు మరింత పెరిగాయని, అడవుల్లో నివసించే ఆదివాసీలను పాలనా పరిధిలోకి తీసుకొచ్చి వారికి అన్యాయం చేశారని అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో భారత్, పాకిస్థాన్‌లుగా విభజించి ప్రజల మధ్య శాశ్వత విభేదాలకు కారణమయ్యారని కవిత పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన సాగిన అనేక దేశాల నుంచి సంపదను తరలించారని ఆరోపించారు. భారతదేశం నుంచి తీసుకెళ్లిన కోహినూర్ వజ్రంతో పాటు ఇతర సంపదను తిరిగి ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ పాలనలో ఏర్పడిన కొన్ని ఆలోచనా విధానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని కవిత అన్నారు. ఇంగ్లీష్ మాట్లాడేవారినే గొప్పగా చూసే ధోరణి మారాలని సూచించారు. మన భాషలో మాట్లాడితే తక్కువగా చూసే భావనను విడనాడాలని చెప్పారు. చర్మం రంగు ఆధారంగా మనుషులను గొప్ప, తక్కువగా విభజించే భావజాలాన్ని కూడా తిరస్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
“బ్రిటిష్ కాలం నాటి ఆలోచనా విధానాలను పూర్తిగా వీడాలి. మన పూర్వీకులు చేసిన పోరాటం, వారి త్యాగాలు, దేశ చరిత్రను పిల్లలకు వివరించాలి. చరిత్రను పూర్తిగా తెలుసుకున్నప్పుడే మంచి భవిష్యత్తును నిర్మించగలం” అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.





























