ప్రతిపక్షం, ఆగస్టు 16: ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో యూరప్ దేశాలను తీవ్ర వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. సాధారణ స్థాయిని మించి ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా వేడిగాలుల కారణంగా సంభవించిన మరణాలపై వెలువడిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది.
యూరోపియన్ మోర్టాలిటీ మానిటరింగ్ నెట్వర్క్ అంచనాల ప్రకారం.. జూన్ 22 నుంచి 28 వరకు కేవలం వారం రోజుల్లోనే సుమారు 16 వేల మంది మృతి చెందినట్లు వెల్లడైంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో వేడిగాలుల ప్రభావం మరింత తీవ్రంగా మారినట్లు నివేదిక పేర్కొంది.
ముఖ్యంగా ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ దేశాల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు తెలిపింది. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. వేడి కారణంగా గుండె, శ్వాస సంబంధిత సమస్యలు పెరగడం కూడా మరణాలకు కారణమై ఉండొచ్చని అంచనా వేసింది.
యూరప్‌లో ఇటీవలి కాలంలో తరచుగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలోనూ ఇదే తరహాలో హీట్‌వేవ్ తీవ్ర ప్రభావం చూపిందని నివేదిక గుర్తుచేసింది. 2022లోనూ హీట్‌వేవ్ సమయంలో సుమారు 16 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.
వాతావరణ మార్పుల ప్రభావంతో భవిష్యత్తులో ఇలాంటి తీవ్రమైన వేడిగాలులు మరింత తరచుగా సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.





























