[t4b-ticker]

2027 జనాభా లెక్కల్లో వెనుకబడిన వర్గాల సమగ్ర గణనకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి

ప్రధానికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, ఆగస్టు 16: 2027 జనాభా లెక్కల్లో ఇతర వెనుకబడిన తరగతులు, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.వెనుకబడిన వర్గాల వాస్తవ జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై విశ్వసనీయ సమాచారం ఉంటేనే రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, సంక్షేమం, సమాన ప్రాతినిధ్యానికి సంబంధించిన విధానాలను సమర్థవంతంగా అమలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక విభాగాలు ఉన్నట్లుగానే వెనుకబడిన తరగతులకు కూడా జనాభా లెక్కల ప్రశ్నావళిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. కులాల పేర్ల నమోదు విషయంలో గతంలో ఎదురైన అక్షర దోషాలు, స్థానిక పేర్లు, పర్యాయపదాలు, ఉపకులాల సమస్యలు పునరావృతం కాకుండా ప్రమాణీకృత విధానాన్ని రూపొందించాలని కోరారు.తెలంగాణలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే అనుభవాలను జాతీయ స్థాయిలో 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు.

రాష్ట్రాల వారీగా సమగ్ర కులాల జాబితా రూపొందించడం, ప్రతి కులానికి ప్రత్యేక సంకేత సంఖ్య కేటాయించడం, జాబితాలో లేని కులపేర్లను నమోదు చేసి ధృవీకరించడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు విశ్వసనీయమైన కులాల వారీ జనాభా సమాచారం ఎంతో అవసరమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జనాభా లెక్కలు ప్రారంభమయ్యే ముందే అవసరమైన విధానపరమైన, సాంకేతిక, సమాచార భద్రత చర్యలను అమలు చేయాలని ప్రధానమంత్రిని కోరారు.

Spread the love

Related News

Latest News