ప్రతిపక్షం, ఆగస్టు 17, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈసారి కూడా రాఖీ పండుగకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. కుటుంబంతో కలిసి ఆయన అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. తన కుమార్తెకు వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు, సుమారు 15 రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ అమెరికా పర్యటన కారణంగా ఆగస్టు 28న జరగనున్న రాఖీ పండుగకు ఆయన హైదరాబాద్‌లో అందుబాటులో ఉండే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో వరుసగా మూడో ఏడాది ఆయన రాఖీ వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవితతో రాఖీ పండుగకు సంబంధించిన కుటుంబ అనుబంధం గత కొన్నేళ్లుగా రాజకీయ పరిణామాల కారణంగా దూరమవుతూ వస్తోంది. 2024లో కవిత జైలులో ఉండటంతో రాఖీ వేడుకలకు అన్నాచెల్లెళ్లు దూరంగా ఉన్నారు. 2025లోనూ కవిత కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ ఏడాది కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండటంతో మరోసారి రాఖీ సందర్భంగా అన్నాచెల్లెళ్ల కలయికకు అవకాశం లేకుండా పోయినట్లు సమాచారం.
కేటీఆర్ అమెరికా పర్యటన ప్రధానంగా తన కుమార్తె విద్యకు సంబంధించిన అంశాల కోసమేనని తెలుస్తోంది. వర్జీనియా టెక్‌లో ఆమె అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు అక్కడి ఏర్పాట్లను చూసుకోవడానికి కుటుంబంతో కలిసి వెళ్లినట్లు సమాచారం.
మొత్తంగా రాజకీయంగా అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలోనే వరుసగా మూడో ఏడాది రాఖీ పండుగకు కేటీఆర్ దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది రాఖీ రోజున కేటీఆర్ అమెరికాలోనే ఉండే అవకాశాలు ఉండటంతో కుటుంబపరంగానూ, రాజకీయంగానూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది.





























