ప్రతిపక్షం, ఆగస్టు 19: నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు బోధించే లెక్చరర్ భాస్కర్ కొంతకాలంగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు రావడంతో తల్లిదండ్రులు, ఏబీవీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల వద్దే లెక్చరర్‌ను నిలదీసి దాడికి పాల్పడ్డారు.
విద్యార్థినులను వేధించడంపై సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం కార్యకర్తలు కళాశాలకు చేరుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌ను ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో అతడిపై దాడి చేసినట్లు సమాచారం.
విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అలాగే విద్యార్థినులు మైనర్లు కావడంతో ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు కోరారు. విద్యార్థినులకు కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు, కళాశాల అధికారులు పూర్తి వివరాలు సేకరించి విచారణ చేపట్టాల్సి ఉంది. విద్యార్థినులపై వచ్చిన వేధింపుల ఆరోపణలపై నిజానిజాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.





























