ప్రతిపక్షం, ఆగస్టు 19: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరలు పెంచడం ద్వారా ఎగ్జిబిటర్లకు వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.
టికెట్ ధరల పెంపు ద్వారా థియేటర్లకు అదనంగా వచ్చే ఆదాయాన్ని లెక్కించి అందులో 20 శాతం మొత్తాన్ని టీజీఎఫ్‌డీసీ ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిర్మాతలు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అంశంపై ప్రభుత్వం అనుమతులు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే పెరిగిన టికెట్ ధరల ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వ పరిధిలోని ఫిల్మ్ డెవలప్‌మెంట్ సంస్థకు జమ చేయాలని తాజాగా నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఉత్తర్వులతో టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంపై ప్రభుత్వ పర్యవేక్షణ మరింత పెరగనుంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.





























