ప్రతిపక్షం, ఆగస్టు 19: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ శామీర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు నక్క సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల అధ్యక్షుల పేర్ల స్వీకరణ సమావేశం, బీఎల్‌ఏల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. జిల్లా నాయకులు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై నాయకులు చర్చించారు. అనంతరం బీఎల్‌ఏలను సన్మానించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. శామీర్‌పేట్ డివిజన్‌లో నూతన కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వరంగల్–శామీర్‌పేట్–మేడ్చల్ ప్రధాన రహదారుల అభివృద్ధికి సుమారు రూ.5 వేల కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.





























