ప్రతిపక్షం, ఆగస్టు 14, హైదరాబాద్: గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసినప్పటికీ, తాము సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు.
ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 55 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడాన్ని అడ్డుకునేందుకు కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
గత ప్రభుత్వం సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకుంటోందని సీఎం పేర్కొన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువతకు ప్రయోజనం కలిగేలా పలు పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనా సీఎం ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.





























