ప్రతిపక్షం, ఆగస్టు 18: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశం అనంతరం అదే రోజు సాయంత్రం బ్రిటన్ పర్యటనకు బయలుదేరనున్నారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి అమెరికాకు వెళ్లనున్నారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికాకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించనున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, మౌలిక వసతులు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.
ముఖ్యమంత్రి వెంట ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పర్యటనలో పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను విదేశీ ప్రతినిధులకు వివరించనున్నారు.
దాదాపు 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ విదేశీ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 30న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణకు కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.





























