కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్ చేయాలి
రిజర్వాయర్లు, చెరువులు నింపాలి
నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా ఇవ్వాలి
హరీశ్ రావు డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, ఆగస్టు 10: “వానాకాలం సాగు సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. ప్రభుత్వానికి సాగునీటిపై స్పష్టత లేదు. దీంతో రైతుల్లో నెలకొన్న ఆందోళన నెలకొంది. దీనిని తొలగించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి” అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేసి నింపాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.”ఒకవైపు వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో తగినంత నీరు లేదు. ఈ పరిస్థితి సాగుపై ప్రభావం చూపుతోంది” అని హరీశ్ రావు పేర్కొన్నారు. వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి రైతులను బయట పడేయడానికి ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.
మిడ్ మానేరు నుంచి చర్యలు ప్రారంభించాలి
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మిడ్ మానేరు రిజర్వాయర్‌కు పూర్తి నీటి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీటి లభ్యత ఉందని హరీశ్ రావు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరిలోకి మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ పరిస్థితిని ఉపయోగించుకుని మిడ్ మానేరు మోటార్లను ఆన్ చేసి నీటిని పంపింగ్ చేయాలని ఆయన కోరారు. అందుబాటులో ఉన్న నీటిని సకాలంలో వినియోగించక పోతే రైతుల సాగు ప్రణాళికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు.
వరుసగా రిజర్వాయర్లను నింపాలి
మిడ్‌మానేరు నుంచి నీటిని పంపింగ్ చేయడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ (అంతగిరి), రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, నృసింహ(బస్వాపూర్) రిజర్వాయర్లను నింపాలని హరీశ్ రావు సూచించారు.రిజర్వాయర్లను నింపడంతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న కాలువలు, చెరువులు, చెక్ డ్యామ్‌లను నింపాలని కోరారు. దేనివల్ల ఆయకట్టు పరిధిలోని రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పై రిజర్వాయర్ల ద్వారా సుమారు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. గత యాసంగి సీజన్‌లో ఈ పరిధిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రస్తుత వానాకాలం పంటతో పాటు రానున్న యాసంగి సీజన్‌కు కూడా సాగునీరు అందించాలంటే ఇప్పటి నుంచే రిజర్వాయర్లను నింపే ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎల్‌ఎండీకి నీటిని తరలించాలి
లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండీ) పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 6.9 టీఎంసీల నీటి లభ్యత ఉందని హరీశ్ రావు తెలిపారు. మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటిని తరలించాలని చెప్పారు. అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్–2 పరిధిలోని అవసరమైన ఆయకట్టుకు సాగునీరు అందించాలని కోరారు.
రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలి
రైతుల సాగు ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు తావులేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని రైతుల అవసరాలకు వినియోగించడంలో ఆలస్యం చేయకూడదన్నారు.రైతు పొలంలో పంట నిలబడాలంటే సకాలంలో సాగునీరు అందాల్సిందేనని చెప్పారు. రిజర్వాయర్లు నిండితేనే ఆయకట్టు రైతుల్లో భరోసా ఏర్పడుతుందని పేర్కొంటూ, తక్షణమే కాళేశ్వరం మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హరీశ్‌రావు కోరారు.































