ప్రతిపక్షం, ఆగస్టు 11: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలికకు ఆర్ఎంపీ ఇంజెక్షన్ ఇవ్వగా.. ఆమె స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న హేమశ్రీ బోనాల పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా బస్వాపురానికి వెళ్లింది. పండుగ అనంతరం ఆమెకు జలుబు, దగ్గు రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ సంపత్ వద్దకు తీసుకెళ్లారు.
బాలికకు సంపత్ ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే హేమశ్రీ స్పృహ కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆమెను ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు.
ఆర్ఎంపీ సంపత్ మద్యం మత్తులో ఉండి నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని హేమశ్రీ తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటన అనంతరం సంపత్ అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.
బాలిక మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఇంజెక్షన్ వల్లే బాలిక మృతి చెందిందా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయాలను వైద్య పరీక్షలు, దర్యాప్తు అనంతరం నిర్ధారించాల్సి ఉంది.





























