[t4b-ticker]

‘అడ్వాన్స్ టిప్’ అడగొద్దు.. క్యాబ్ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 14: ప్రయాణికుల నుంచి రైడ్‌ ప్రారంభానికి ముందే ‘అడ్వాన్స్ టిప్’ అడిగే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఉబర్, ఓలా వంటి క్యాబ్ సేవల సంస్థలు తమ యాప్‌లలో ఉన్న ముందస్తు టిప్‌ ఆప్షన్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.

ప్రయాణికులు క్యాబ్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే అదనంగా టిప్‌ చెల్లించాల్సిన పరిస్థితి ఉండకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ముందుగానే ఎక్కువ మొత్తంలో టిప్‌ చెల్లిస్తే క్యాబ్‌ త్వరగా వస్తుందనే అభిప్రాయం ప్రయాణికుల్లో కలిగే అవకాశం ఉందని పేర్కొంది.

క్యాబ్‌ సేవల్లో పారదర్శకత, సమాన అవకాశాలు ఉండాలని కేంద్రం సూచించింది. అదనపు మొత్తాన్ని చెల్లించిన ప్రయాణికులకు మాత్రమే మెరుగైన లేదా వేగవంతమైన సేవలు అందుతున్నట్లుగా భావించే పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని క్యాబ్‌ సంస్థలకు తెలిపింది.

అయితే రైడ్‌ పూర్తయిన తర్వాత డ్రైవర్‌ సేవలపై సంతృప్తి చెందిన ప్రయాణికులు తమ ఇష్టానుసారం టిప్‌ ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందే టిప్‌ అడగడం, ప్రయాణం తర్వాత ప్రయాణికులు స్వచ్ఛందంగా టిప్‌ ఇవ్వడం రెండింటి మధ్య తేడా ఉందని పేర్కొంది.

కేంద్రం ఆదేశాలతో క్యాబ్‌ సేవల యాప్‌లలోని టిప్‌ విధానంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News