[t4b-ticker]

ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉద్ధృతం.. హేమంత్‌ సోరెన్‌ రాజీనామాకు డిమాండ్

ప్రతిపక్షం, ఆగస్టు 16: ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఝార్ఖండ్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తొలుత పరీక్షలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విద్యార్థులు.. ఇప్పుడు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగ పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. తమ భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియామక ప్రక్రియపై తమకు పూర్తిస్థాయిలో నమ్మకం కలిగేలా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో అధికార కూటమిలోని కాంగ్రెస్‌పై కూడా విద్యార్థులు ఒత్తిడి పెంచుతున్నారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నుంచి కాంగ్రెస్‌ వైదొలిగి తమ ఆందోళనకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఆందోళనల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా సీఎం హేమంత్‌ సోరెన్‌తో పాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Spread the love

Related News

Latest News