ప్రతిపక్షం, ఆగస్టు 18, మేడ్చల్: గత పదేళ్లలో సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ అనేక గ్రామాలకు తాగునీరు అందలేదని విమర్శించారు.
మంగళవారం శామీర్‌పేట మండలంలోని ఘన్పూర్గుట్ట వద్ద మిషన్ భగీరథ పనులను భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌తో కలిసి బీర్ల ఐలయ్య పరిశీలించారు. అధికారులతో, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.1,212 కోట్లతో 2,030 గ్రామాలకు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో సుమారు 1,400 గ్రామాలకు తాగునీరు అందలేదని ఐలయ్య తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ఢిల్లీకి వెళ్లి రూ.210 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. మొత్తం 16 కిలోమీటర్ల మేర సాగునీరు అందించాల్సిన పనుల్లో ఇప్పటికే 11 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన నాలుగు కిలోమీటర్ల పనులకు అటవీశాఖ అనుమతులు తీసుకున్నామని, పనులను వేగవంతం చేసి దసరాలోగా ఆలేరు, భువనగిరి, మేడ్చల్ ప్రాంతాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్ల తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐలయ్య తెలిపారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.
అంతకుముందు అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఓబీసీ జిల్లా చైర్మన్ రవి ముదిరాజ్, మాజీ మార్కెట్ కమిటీ సభ్యుడు సత్యనారాయణ, అలియాబాద్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు రమేష్, డివిజన్ అధ్యక్షులు చాప రాజు, నాయకులు అశోక్‌రెడ్డి, రాజు నాయక్, సంతోష్‌గౌడ్, నారాయణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





























