[t4b-ticker]

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ సీరియస్.. పార్టీ క్రమశిక్షణపై కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్షం, ఆగస్టు 14, హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ నిర్ణయాలు, విధానాలకు భిన్నంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంటుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన అంశాలను బహిరంగ వేదికలపై చర్చించడం కంటే అంతర్గతంగా మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీనే తమకు మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఇటీవల రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల ఆధిపత్యం పెరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణచివేయొద్దని, ప్రభుత్వం ఇతరుల చెప్పుచేతల్లో ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినప్పటికీ.. ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంపై ఉన్న అప్పులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆరోపించారు. గత పాలనలో పేరుకుపోయిన ఆర్థిక భారాన్ని ప్రస్తుత ప్రభుత్వం అధిగమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసుకుని ముందుకు వెళ్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ నాయకత్వం కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై చర్చ జరుగుతున్న వేళ టీపీసీసీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Spread the love

Related News

Latest News