ప్రతిపక్షం, ఆగస్టు 14: ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై భారత ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన చారిత్రక సందర్భానికి ఎర్రకోట ప్రత్యక్ష సాక్షిగా నిలవడమే ఇందుకు ప్రధాన కారణం.
1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర్యం పొందిన సందర్భంగా తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అప్పటి నుంచి ప్రతి ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
ఎర్రకోటకు భారత చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. మొఘల్ పాలనకు సంబంధించిన చారిత్రక వారసత్వంతో పాటు బ్రిటిష్ పాలనను ముగించి స్వతంత్ర భారతదేశం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన కాలానికి ఇది ప్రతీకగా నిలిచింది.
అందుకే ఎర్రకోటపై జెండా ఎగురవేయడం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. భారత స్వాతంత్ర్యం, దేశ చరిత్ర, ప్రజాస్వామ్య పాలనకు ప్రతీకగా కొనసాగుతున్న చారిత్రక సంప్రదాయం.





























