సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 19: ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా నిలిచి పోరాడతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఉద్యోగులు చేస్తున్న పోరాటంలో బీజేపీ ముందుంటుందని తెలిపారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసినా ఆ దెబ్బలను తాము భరిస్తామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యోగులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీలను నమ్మి ఉద్యోగులు, కాలేజీ యాజమాన్యాలు మోసపోవద్దని సూచించారు.
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాటం *
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోందని బండి సంజయ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో కరీంనగర్‌లో వేలాది మందితో ‘ఫీజు పోరు’ నిర్వహించనున్నట్లు చెప్పారు. చివరి వరకు పోరాడే నాయకులతోనే జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని, రాజీ పడే నాయకులకు జేఏసీలో చోటు ఇవ్వొద్దని సూచించారు.
- కరీంనగర్ డెయిరీపై కుట్రలు సరికాదు*
కరీంనగర్ డెయిరీని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. డెయిరీ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఒక వ్యక్తిపై ఉన్న అక్కసుతో రైతులకు ఉపయోగపడే వ్యవస్థను దెబ్బతీయడం సరికాదన్నారు.లక్షలాది మంది రైతులకు మేలు చేసే కరీంనగర్ డెయిరీపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం సాయం చేయకపోయినా పర్వాలేదని, అయితే అన్యాయం చేస్తే రైతులు క్షమించబోరని హెచ్చరించారు.
- ఫోటోగ్రాఫర్లకు సన్మానం*
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సన్మానించారు.






























