ప్రతిపక్షం, ఆగస్టు 20, శామీర్‌పేట్:మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని దేవరయాంజాల్‌లో అయన విగ్రహానికి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, శామీర్‌పేట్ డివిజన్ దేవరయాంజాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా భీమిడి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునికత, సాంకేతిక రంగాల వైపు నడిపించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దూరదృష్టి కలిగిన నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన సేవలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, రాజీవ్ గాంధీ చూపిన అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ తిరుపతి శంకర్ గౌడ్, శ్రీ సీతారామ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పేండం లక్ష్మినారాయణ, మాజీ ధర్మకర్తలు ఎల్లెంకి భారతి, వలందాసు మురళి గౌడ్, నానిగళ్ళ హరిగోపాల్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పిన్నింటి ధర్మారెడ్డి, సుతారిగూడెం దుర్గయ్య, కాంగ్రెస్ నాయకులు మిర్యాలకర్ సాయి కుమార్, నానిగళ్ళ శ్రీనివాస్, గ్యారాల ప్రవీణ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి రమేష్ తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు.




























