*సేవ చేస్తే శిక్షేనా? – ఇ.ఎల్.వి. ఫౌండేషన్ సభ్యులపై చర్యలు అప్రజాస్వామికం.
*పార్టీ కంటే సేవే గొప్పది – క్రమశిక్షణ పేరుతో బెదిరింపులు ఆపండి.
*ఇ.ఎల్.వి. ఫౌండేషన్ పై రాజకీయ కక్ష – ప్రజాస్వామ్యంలో ఇది దుర్మార్గం.
*సేవా కార్యక్రమాలను అడ్డుకోవద్దు – రాజకీయ పార్టీలకు ప్రజల హెచ్చరిక.
*ప్రజా సేవే ప్రధాన లక్ష్యం : ఫౌండేషన్ చైర్మన్ ఇ.ఎల్.వి. భాస్కర్.
ప్రతి పక్షం చండూరు ఆగస్టు 20: యువత సామాజిక బాధ్యతతో ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సభ్యులపై రాజకీయ పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇ.ఎల్.వి. భాస్కర్ తీవ్రంగా ఖండించారు. అన్ని రాజకీయ పార్టీలను,ప్రజా సంఘాలను కలుపుకొని కేవలం ప్రజల సంక్షేమం, సేవే లక్ష్యంగా ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, పేదలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న సభ్యులపై రాజకీయ కారణాలతో చర్యలు తీసుకోవడం అత్యంత విచారకరమని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. సేవా దృక్పథాన్ని ప్రోత్సహించాల్సిన సమయంలో, సేవ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం సంబంధిత వ్యక్తుల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు.
ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఫౌండేషన్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సొంతం కాదని, ఏ పార్టీకి వ్యతిరేకం కూడా కాదని తెలిపారు. ప్రజా సేవే ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.రాజకీయ వేధింపులు, పార్టీ నిర్ణయాలు లేదా ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా సమాజ శ్రేయస్సు కోసం ఫౌండేషన్ బాటలో నడిచే సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఇ.ఎల్.వి. భాస్కర్ స్పష్టం చేశారు. “యువతను అణచివేయాలని చూస్తే ఎంతటి వారైనా సహించేది లేదు. యువతలో సేవా స్ఫూర్తిని అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యం కాదు. రానున్న రోజుల్లో యువతే ప్రజాస్వామ్య పద్ధతిలో సరైన సమాధానం చెబుతుంది” అని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా తమ సేవా ప్రయాణాన్ని మరింత విస్తృతంగా, నిరంతరాయంగా కొనసాగిస్తామని ఈ సందర్బంగా ఇ.ఎల్.వి. భాస్కర్ తెలిపారు.





























