ప్రతిపక్షం, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్‌లో ఆరేళ్ల యూకేజీ విద్యార్థి ప్రణయ్ మృతి విషాదాన్ని నింపింది. బాలుడు గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ స్పందించారు. చిన్నారికి గుండెపోటు వచ్చిందని ఇప్పుడే నిర్ధారించలేమని ఆయన స్పష్టం చేశారు.
తీవ్రమైన ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు గుండె అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందని చంద్రశేఖర్ తెలిపారు. గతంలో ఎంసెట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లోనూ తీవ్ర ఒత్తిడి కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రణయ్ తీవ్ర ఒత్తిడికి గురై ఉంటే.. దాని ప్రభావంతో గుండె విద్యుత్ కార్యకలాపాలు అకస్మాత్తుగా నిలిచిపోయి ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బాలుడి మృతికి అసలు కారణాన్ని వైద్యపరమైన పరీక్షలు, పూర్తి వివరాల ఆధారంగానే నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపారు.
చిన్నారులపై చదువు లేదా ఇతర విషయాల్లో అధిక ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలతో ఎంతో సున్నితంగా, ప్రేమగా వ్యవహరించాలని చెప్పారు. చిన్నారుల్లో భయం, ఆందోళన లేదా ఒత్తిడి కనిపిస్తే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెంటనే గుర్తించి తగిన సహాయం అందించాలని సూచించారు.





























