ప్రతిపక్షం, ఆగస్టు 21: నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఆకస్మిక తనిఖీకి వెళ్లిన తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు.. కార్యాలయంలోని వాష్‌రూమ్ పరిస్థితిని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయంలో కనీస పరిశుభ్రత కూడా లేకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు.
తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న సమయంలో మంత్రి వాష్‌రూమ్‌ను తనిఖీ చేశారు. అక్కడ అపరిశుభ్రత తీవ్రంగా ఉండటాన్ని గమనించిన ఆయన అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
అంతటితో ఆగకుండా మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా వాష్‌రూమ్‌ను శుభ్రం చేశారు. నీళ్లు చల్లి టాయిలెట్‌ను శుభ్రం చేస్తూ అధికారులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు.
ప్రజలు వివిధ పనుల కోసం ప్రతిరోజూ ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారని.. అలాంటి చోట్ల పరిశుభ్రమైన వాతావరణం ఉండటం ఎంతో ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. కార్యాలయాలు, వాష్‌రూమ్‌లు, పరిసర ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి స్వయంగా టాయిలెట్‌ను శుభ్రం చేయడం అక్కడున్న అధికారులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులకు పరిశుభ్రతపై ప్రత్యక్షంగా సందేశం ఇచ్చేందుకే మంత్రి ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.





























