పాలిటెక్నిక్ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు
విద్యార్థుల ఆందోళనకు మాజీ మంత్రి హరీశ్‌రావు మద్దతు
ప్రతిపక్షం, నంగునూరు, ఆగస్టు 22: పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలతో విలీనం చేసే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలో సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలతో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాజ్‌గోపాల్ పేట్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న హరీశ్‌రావు అక్కడికి చేరుకుని విద్యార్థులను కలుసుకుని వారి ఆందోళనకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, “నేను కూడా పాలిటెక్నిక్ విద్యార్థినే. ఆ చదువుల ప్రాముఖ్యత, విద్యార్థులు పడే కష్టాలు నాకు బాగా తెలుసు” అని అన్నారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యాసంస్థలకు ఏడు దశాబ్దాల సుదీర్ఘమైన, ఘనమైన చరిత్ర ఉందని, ఈ విద్య ద్వారా ఎంతోమంది నిరుపేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు.
95 శాతం మంది నిరుపేద విద్యార్థులే
రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సుమారు 95 శాతం మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారేనని హరీశ్‌రావు తెలిపారు. నామమాత్రపు ఫీజులతోనే డిప్లొమా స్థాయిలో నాణ్యమైన సాంకేతిక, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం వారికి లభిస్తోందన్నారు.పాలిటెక్నిక్ విద్యను ఐటీఐ వ్యవస్థలో కలిపితే దాని ప్రత్యేకత, స్థాయి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశం ఉందని, ఈ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఐటీఐలతో విలీనం చేస్తే ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి సంబంధించిన ప్రస్తుత అవకాశాలు దెబ్బతిని, విద్యార్థులు మళ్లీ ఇంటర్మీడియట్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. దీంతో ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.
ముందస్తు అభిప్రాయ సేకరణ లేకుండానే నిర్ణయం
ఎలాంటి ముందస్తు అభిప్రాయ సేకరణ లేకుండా, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, మేధావులతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని హరీశ్‌రావు విమర్శించారు. కనీస విధివిధానాలను కూడా స్పష్టంగా వెల్లడించకపోవడంతో విద్యార్థులు తమ భవిష్యత్తుపై అయోమయానికి గురవుతున్నారని అన్నారు.పటిష్టమైన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను తెలంగాణ విద్యాశాఖ పరిధి నుంచి తొలగించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చే ప్రయత్నం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
పాలిటెక్నిక్ కళాశాలలను ఇతర శాఖల పరిధిలోకి మార్చే ప్రతిపాదనలు, బిల్లులను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఏఐసీటీఈ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే, ఎస్‌బీటీఈటీ బోర్డు పర్యవేక్షణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు కొనసాగాలని స్పష్టం చేశారు. జీవో 97ను రద్దు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశానని, అసెంబ్లీలో కూడా విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.సిద్దిపేట ఉమెన్స్ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ, ఆ పార్టీ విద్యార్థి విభాగం పూర్తి అండగా ఉంటుందని హరీశ్ రావు ప్రకటించారు. పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను పాత విధానంలోనే యథాతథంగా కొనసాగించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు.






























