ప్రతిపక్షం, ఆగస్టు 21: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కుటుంబం వ్యవహారం రోజురోజుకూ వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సీఎం సహా పలువురు మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సుస్మిత వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణలో స్పష్టం చేశారు.
సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారం నేపథ్యంలో కాంగ్రెస్‌లోని పలువురు ఎమ్మెల్యేలు కీలకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. నేడు సుమారు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం.
ఈ సమావేశం అనంతరం సీఎల్పీ వేదికగా ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కొండా సురేఖపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేయనున్నట్లు సమాచారం. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో కొండా కుటుంబం వ్యవహారం పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బయటకు తీసుకొచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై సురేఖ వివరణ ఇచ్చినప్పటికీ, పార్టీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్న డిమాండ్లు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదే సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ నేతల మధ్య విభేదాలు, బహిరంగ వ్యాఖ్యలు, క్రమశిక్షణ అంశాలపై ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
దీంతో నేడు జరగనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కొండా సురేఖపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.





























