పారిశుద్ధ్య కార్మికుల పది నెలల జీతాల విడుదల చేయాలి

సిద్ధిపేటలో సమ్మె చేస్తున్న కార్మికులకు హరీశ్ రావు సంఘీభావం

కలెక్టర్, మంత్రితో మాట్లాడతానని హామీ

ప్రతిపక్షం ప్రతినిధి,సిద్ధిపేట అక్టోబరు 15: బకాయి పడిన పది నెలల వేతనాలను పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. సంబంధిత మంత్రితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు.

గత సంవత్సరానికి సంబంధించిన నాలుగు నెలలు, ఈ సంవత్సరానికి సంబంధించిన ఆరు నెలల జీతాలు కలిపి మొత్తం పది నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు. పండుగల సమయంలో జీతాలు అందక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. దసరా, బతుకమ్మ పండుగలలోపు కార్మికులకు రావాల్సిన పెండింగ్ జీతాలు, ఇతర బకాయిలు విడుదలయ్యేలా జిల్లా కలెక్టర్‌తో, సంబంధిత మంత్రితో మాట్లాడతానని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Spread the love

Related News

Latest News