ప్రతిపక్షం, అక్టోబర్ 24: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి హాలీవుడ్‌లో సినిమా చేయాలనే తన కోరికను వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తర్వాత హాలీవుడ్ నుంచి తనకు పలు అవకాశాలు వచ్చాయని తెలిపారు. అయితే అప్పటికే ‘వారణాసి’ సినిమా పనులు ప్రారంభించడంతో ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించలేకపోయానని చెప్పారు. ఒకేసారి పలు సినిమాలపై పనిచేయడం తనకు సాధ్యం కాదని పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, అక్కడి పనితీరు, సినిమా నిర్మాణ విధానాలను దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని వివరించారు. అందుకే తన కెరీర్‌లో కనీసం ఒక్క హాలీవుడ్ సినిమాకైనా దర్శకత్వం వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ‘వారణాసి’ సినిమా పూర్తయిన తర్వాత హాలీవుడ్ అవకాశాల గురించి ఆలోచిస్తానని రాజమౌళి తెలిపారు. బ్రెజిల్‌లో నిర్వహించిన 50వ సావో పౌలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రాజమౌళి, భవిష్యత్తులో హాలీవుడ్ ప్రాజెక్టుతో అంతర్జాతీయ చిత్ర పరిశ్రమలో మరో అడుగు వేస్తారా అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన ‘వారణాసి’ సినిమాపై దృష్టి సారించగా, ఆ చిత్రం తర్వాత హాలీవుడ్ అవకాశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.





























