హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్‌పల్లి తండాలో ప్రేమోన్మాది దాడిలో యువతి దీపన తమాంగ్ (25) మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రాకేశ్.. మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ నల్లగండ్లలో బ్యుటీషియన్‌గా పనిచేస్తోంది. ఆమె గోపన్‌పల్లి తండా సమీపంలో స్నేహితులతో నివాసముంటోంది. కొంతకాలంగా రాకేశ్‌తో ఆమెకు పరిచయం ఉంది. పెళ్లిచేసుకోవాలని ఏడాది నుంచి అతడు వెంటపడుతున్నాడు. దానికి దీపన నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన రాకేశ్.. నిన్న రాత్రి కూరగాయల కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో దీపన మృతి చెందింది. అడ్డుకునేందుకు యత్నించిన స్నేహితులపైనా దాడికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.