మానవత్వాన్ని మించిన సిద్ధాంతం లేదు!

కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనం

సిద్ధిపేటలో దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు..

వివిధ పార్టీలు,ప్రజా సంఘాల నాయకుల ఆత్మీయ పలకరింపులు

ప్రతిపక్షం, సిద్ధిపేట, అక్టోబర్ 25: సిద్ధాంతాలు వేరైనా.. రాజకీయ పార్టీలు వేరైనా.. కులమతాలకు అతీతంగా అందరినీ కలిపేది మానవత్వమేనని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన రావు అన్నారు. తత్వాలు ఎన్ని ఉన్నా మానవత్వాన్ని మించిన తత్వం మరొకటి లేదని స్పష్టం చేశారు. భారతదేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. విదేశాల్లోనూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగలను నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.

ఆత్మీయతకు వేదికగా అలయ్ బలయ్

సిద్ధిపేట జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి స్నేహ భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో 2018 నుంచి శ్రీకాంత్ రెడ్డి అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. బండారు దత్తాత్రేయ ప్రారంభించిన అలయ్ బలయ్ కార్యక్రమ స్ఫూర్తితో ఈ వేడుకలను నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సామాజిక ఐక్యతకు ఈ కార్యక్రమం దోహదపడుతోందన్నారు. ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించడం సంతోషకరమని తెలిపారు. వేడుక విజయవంతానికి సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

అతిథులకు సత్కారం

కార్యక్రమానికి హాజరైన అతిథులందరినీ నిర్వాహకుడు దూది శ్రీకాంత్ రెడ్డి శాలువాలతో సత్కరించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకచోట చేరి ఆత్మీయంగా మాట్లాడుకోవడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గ్యాదరి పరమేశ్వర్, కోమాండ్ల విక్రం రెడ్డి, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఇర్రి ఉమా రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వంశీ గౌడ్, మాజీ మీడియా అకాడమీ సభ్యుడు కొమురవెల్లి అంజయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, కాంగ్రెస్ నాయకుడు బొమ్మల యాదగిరి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకట్, సంతోష్, జర్నలిస్టు నాయిని సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News