*2026 ఖరీఫ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్, మేయర్
*గ్రేడ్-ఏ కి రూ.2461, సన్నాలకు అదనంగా రూ.500 బోనస్.
*ఎల్ నినో దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలు వేయండి – రైతులకు కలెక్టర్ సూచన.
ప్రతిపక్షం నల్గొండ అక్టోబర్ 26: ఈ ఖరీఫ్ లో దాన్యం పండించిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ కోరారు. ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని , డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధర పొందడమే కాకుండా, అధిక లాభాలను అర్జించవచ్చని అన్నారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాల బావిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 2026 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు .
*రైతులు మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించాలి:
రైతులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ లో గ్రేడ్ -ఏ ధాన్యానికి 2461 /- రూపాయలు,కామన్ వెరైటీకి 2441/- రూపాయలు మద్దతు ధర ప్రకటించిందని, సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నదని ,రైతులు ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు తాలు,తరుగు, చెత్త,మట్టిపెళ్ళలు,దుమ్ము వంటివి లేకుండా, 17 శాతం లోపు తేమ తో నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు .ఈ ఖరీఫ్ లో జిల్లాలో సన్న ,దొడ్డు రకాలు కలిపి 6 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు వచ్చేందుకు అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. ఖరీఫ్ దాన్యం సేకరణకు జిల్లాలో 399 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని , సన్న ధాన్యం పండించిన రైతులు మద్దతు ధరతో పాటు, బోనస్ పొందేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి రైతులు తెచ్చే సన్నధాన్యం వెరైటీలను విశ్లేషించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు.
మార్కెట్లో సన్న రకం ధాన్యానికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున సన్నాలు పండించిన రైతుల పొలాల వద్దనే మిల్లర్లు వెళ్లి కొనుగోలు చేస్తున్నారని, ఈ విసయం పై రైతులు ఆలోచించాలని, దొడ్డు ధాన్యానికి డిమాండ్ తక్కువగా ఉండడం, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి డిమాండ్ తక్కువగా ఉండడం, సన్నాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నందువల్ల వాటికి ధర ఎక్కువగా వస్తున్నదని తెలిపారు.
*రైతులు ఆరుతడి పంటలను పండించేందుకు ప్రోత్సహించాలి:
రైతులు ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలు వైపు వెళ్లాలని , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రైతులు సమిష్టి వ్యవసాయం చేసి వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, ఉద్యాన పంటలు,ఆరుతడి పంటలు సాగు చేయాలని, డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తే లాభాలు అధికంగా వస్తాయన్నారు. రైతులకు వీటన్నింటిపై అవగాహన కల్పించేందుకు ప్రతి మంగళ, శుక్రవారాలు రైతు వేదికలలో రైతు నేస్తం ద్వారా తెలియజేయడం జరుగుతుందని, ఈ సమావేశాలకు హాజరుకావాలని, సమిష్టి వ్యవసాయం చేసే రైతులకు, అలాగే ప్రత్యామ్నాయ పంటలు పండించే రైతులకు ప్రభుత్వం ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఎల్ నినో దృష్ట్యా ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వరిసాగుకు వెళ్లకుండా తక్కువ నీరు అవసరమయ్యే పంటలు పండించాలని అన్నారు.
*రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం :
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ఖరీఫ్ మాదిరిగానే ఈ ఖరీఫ్ లో రాష్ట్రప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వం సన్నధాన్యాలలో 7 వెరైటీలను సూచించిందని ,ఇందుకు బొనస్ గా 500/- రూపాయలు ఇస్తున్నదని,ఎల్ నినో ప్రభావం నీటిపై ఎక్కువగా ఉన్నందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, ఆదర్శ రైతు రామిరెడ్డి,ఇతర రైతులు మాట్లాడారు. నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జిల్లా సహకార అధికారి మమత, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాంపతి నాయక్, మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ హైమావతి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పిటిసి మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.





























