ప్రతిష్ఠ కోల్పోతున్న రవాణాశాఖ!

  • ఏసీబీ తనిఖీలు.. వరుస వివాదాలు.. పర్యవేక్షణపై ప్రశ్నలు
  • అనధికార ఏజెంట్లు.. అనుమానాస్పద యూపీఐ లావాదేవీలు
  • కేపీహెచ్‌బీ పేకాట కేసులో బండ్లగూడ రవాణాశాఖ అధికారి
  • పోస్టింగులు, పదోన్నతుల్లో పక్షపాతంపై ఆరోపణలు
  • ఓవర్‌లోడ్‌ వాహనాలపై మంత్రి పొన్నం హెచ్చరికలు.. అమలుపై సందేహాలు
  • గ్రేటర్‌ కార్యాలయాల్లో పర్యవేక్షణ లోపాలపై విమర్శలు

ఏసీబీ తనిఖీలు.. నగదు వీడియోలు.. ఉద్యోగులపై చర్యలు.. పేకాట కేసులో అధికారుల పేర్లు! అయినా రవాణాశాఖలో వివాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రజలకు పారదర్శక సేవలందించాల్సిన శాఖలో వరుస ఘటనలు ప్రతిష్ఠను దెబ్బతీస్తుండగా, పర్యవేక్షణ బాధ్యత వహించాల్సిన ఉన్నతాధికారుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓవర్‌లోడ్‌ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించినా.. ఆదేశాల అమలుపై విమర్శలు వినిపిస్తున్నాయి. పోస్టింగులు, పదోన్నతులపై ఆరోపణలు.. గ్రేటర్‌ కార్యాలయాల్లో పరిపాలనా లోపాలపై ఫిర్యాదులు వెరసి శాఖలో జవాబుదారీతనం ఎక్కడన్న ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. తనిఖీలు జరుగుతున్నా.. చర్యలు తీసుకుంటున్నా.. వివాదాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి? రవాణాశాఖ ప్రతిష్ఠను కాపాడేందుకు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు?

(ప్రతిపక్షం ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్)

రవాణాశాఖ ప్రతిష్ఠ గాలిలో కలుస్తున్నది. కార్యాలయాల్లో జరుగుతున్న ఘటనలు, అధికారుల వ్యవహారం తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. నిత్యం ఏదో ఒక అంశం వార్తల్లో నిలుస్తున్నది. ముఖ్యంగా ఉన్నతాధికారుల వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఏసీబీ దాడులు చేస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు. ఆర్టీఓ స్థాయి నుంచి పైస్థాయి అధికారులు పదోన్నతులు, పోస్టింగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్యాలయాల్లో ఉండటం లేదనే అంశం తీవ్ర చర్చకు దారితీస్తున్నప్పటికీ, ఎటువంటి బేషజాలు లేకుండా విధులకు ఎగనామం పెట్టి స్వప్రయోజనాలకే పరిమితమవుతున్నారు. సీట్లలో ఉండి విధులను సమర్థంగా నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు నిత్యం హైదరాబాద్‌లో దర్శనమిస్తున్నా, మానిటరింగ్‌ చేయడంలో విఫలమవుతున్నారు. డీటీసీల్లో చాలా మంది తమ విధులు నిర్వహించకుండా నిత్యం హైదరాబాద్‌లో తిరుగుతున్నారు. రవాణాశాఖకు సంబంధించిన వివిధ కమిటీలకు నాయకత్వం వహిస్తున్నామనే పేరుతో అనేకమంది జిల్లాల్లో ఉండటం లేదు. నామమాత్రంగా వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే హాజరవుతున్నారనే విమర్శ ఉంది.

వీటిని నియంత్రించాల్సిన జేటీసీలు కూడా వారితో చెట్టాపట్టాలేసుకుని అడ్మినిస్ట్రేషన్‌ను గాలికి వదిలేస్తున్నారు. ఓవర్‌లోడ్‌ విషయంలో కేసులు రాయడం లేదని స్వయంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించినా, సదరు డీటీసీ మంత్రి మాటను కూడా లెక్కచేయలేదు. ఓవర్‌లోడ్‌కు సంబంధించి కేసులు రాయకుండా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నా.. డీటీసీ తన స్వలాభానికే ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. సదరు డీటీసీ మేడ్చల్‌లో తక్కువ కాలంలో పెద్ద మొత్తంలో వెనకేసి, తన ఫ్రెండ్‌ పేరును బినామీగా పెట్టి ఇంద్రభవనం వంటి నాలుగంతస్తుల భవనాన్ని మేడ్చల్‌లో నిర్మించారు. ఇక ఒక జేటీసీ ఏకంగా ఏటీసీల వ్యవహారంలో అడ్డంగా బుక్కై.. సెటిలయ్యేదాకా లీవులో వెళ్లి మళ్లీ వచ్చి జాయిన్‌ అయ్యాడు. ఇక పదోన్నతుల విషయాల్లో సీనియారిటీ అనేది ప్రామాణికంగా లేదు. నచ్చని అధికారులకు డీపీసీకి ముందు పాత కేసులు ముందుకు తీసుకొచ్చి మెమోలు ఇవ్వడం.. పదోన్నతుల సమయంలో ఆరోపణలు ఉన్నాయనే సాకుతో పక్కకు తప్పించి, అనుకూలంగా ఉన్న జూనియర్లకు పదోన్నతులు కల్పించడం వంటి విషయాలు మామూలయ్యాయి.

తమకు నచ్చితే ఏసీబీ కేసులు ఉన్నా ఉఫ్‌ మనిపించి పోస్టింగులు ఇప్పించడం రవాణాశాఖలో షరామామూలైంది. గమ్మత్తేమిటంటే, ఎవరైనా అధికారి ఏసీబీకి దొరికినా లేదా వారి కార్యాలయాల్లో సోదాలు జరిగినా, చార్జెస్‌ డ్రాప్‌ చేయించడం, రీపోస్టింగ్‌ ఇప్పించడం కోసం లక్షల్లో లాగుతున్నారు. ఒక ఉద్యోగి కేసులో ఇరుక్కుంటే ఉన్నతాధికారుల నుంచి సచివాలయం వరకు పండుగ జరుపుకుంటున్నారు. ఈ వ్యవహారంలో రవాణాశాఖ కమిషనర్‌ కొంతవరకు నిజాయితీగా ఉన్నప్పటికీ, కింది స్థాయి అధికారులు చక్రం తిప్పుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ విషయంలో కమిషనర్‌ను ఉత్సవ విగ్రహంలా మార్చివేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలు కమిషనర్‌ దృష్టికి వెళ్లకుండా చూస్తున్నారు. ఒకవేళ వెళ్లినా తప్పుడు సమాచారం ఇచ్చి తమ టార్గెట్లను నెరవేర్చుకుంటున్నారు.

గ్రేటర్‌ అస్తవ్యస్తం

గ్రేటర్‌ రవాణాశాఖ కార్యాలయాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మేడ్చల్‌ కార్యాలయంలో అవినీతికి అంతేలేకుండా పోయింది. దళారులే అక్కడ అనధికారులుగా వెలుగొందుతున్నారు. అక్కడి కార్యాలయంలో పనిచేస్తున్న అధికారి ఏజెంట్లను ప్రోత్సహిస్తున్నారనే పేరుంది. ఏ కార్యాలయంలో పనిచేసినా పకడ్బందీగా అవినీతికి బాటలు వేస్తాడనే పేరుంది. మామూలు స్థాయి నుంచి వచ్చిన అధికారి ఆస్తులు దాదాపు రూ.100 కోట్లకు పైగా ఉంటాయని చర్చ జరుగుతున్నది. ఇక అదే జిల్లా పరిధిలోని మరో కార్యాలయంలో ఒక ఎంవీఐ ఉన్నతాధికారులకు చెమటలు పట్టిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్యూటీ చేస్తూ అదే కార్యాలయంలోని అధికారులందరినీ బెదిరిస్తున్నది. నెలనెలా వాహనదారుల వద్ద మంత్లీలు వసూలు చేస్తూ వాహనదారులకు, ముఖ్యంగా హెవీ వెహికల్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ జేటీసీ పరిధిలోని కార్యాలయాలు పూర్తిగా కంట్రోల్‌ తప్పాయి. ఇన్‌చార్జి జేటీసీ ఈ వ్యవహారంలో సక్సెస్‌ కాలేకపోతున్నారు.

దాదాపు అన్ని కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేషన్‌ ఫెయిల్‌ అయ్యిందనే చర్చ జరుగుతున్నది. జేటీసీ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న సెక్షన్‌ రెండు వర్గాలుగా చీలిపోయింది. గుండెకాయలాంటి ఈ సెక్షన్‌లో పనిచేస్తున్న సిబ్బందిని ఏవో వేధిస్తున్నా, దీనిని చక్కదిద్దడం లేదు. జేటీసీ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న సెక్షన్‌ ఆగమవుతున్నా పట్టించుకోవడం లేదు. అంతెందుకు, ఫిల్మ్‌నగర్‌లో ఉన్న కార్యాలయంలో ఏవో అన్నీ తానై చూసుకుంటున్నా, చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. ఇక సికింద్రాబాద్‌ కార్యాలయం చేపల మార్కెట్‌లా మారిపోయింది. ఏసీబీ దాడులు ఎన్నిసార్లు జరిగినా అక్కడి అధికారులు, సిబ్బంది మారడం లేదు. అనేక ఆరోపణలున్నా అధికారికే పగ్గాలు అప్పగించడంతో ఆడింది ఆటగా, పాడింది పాటగా తయారైంది. సేవల కోసం వచ్చేవారిని విపరీతంగా దోచుకోవడంలో ఈ కార్యాలయం స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు అని చెప్పవచ్చు. నిత్యం వివాదాలమయమయ్యే బండ్లగూడ ఆర్టీఓ కార్యాలయాన్ని నియంత్రించడం ఉన్నతాధికారుల వల్ల కావడం లేదు. జేటీసీగా రమేశ్‌ ఉన్న సమయంలో కొంత దారికి వచ్చినప్పటికీ, ఇటీవల మళ్లీ యథాతథ స్థితికి వచ్చింది.

ఇతర కార్యాలయాలకు సంబంధించిన బస్సులకు ఫిట్‌నెస్‌ చేయడం, ఇతర రాష్ట్రాల వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు, ఈ మధ్య ఒక కానిస్టేబుల్‌ డబ్బులు లెక్కపెట్టే వీడియో వైరల్‌ కావడం, అందులో ఇద్దరు అధికారులు, ఒక కానిస్టేబుల్‌ సస్పెండ్‌ కావడం, గతంలో ఇదే ఆఫీసుకు చెందిన ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ పేకాట ఆడుతూ పట్టుబడటం, గతంలో ఒక ఏవోను హెడ్‌ ఆఫీసుకు అటాచ్‌ చేయడం, మళ్లీ సోమవారం మరో అధికారి పేకాట ఆడుతూ ఎస్‌ఓటీ పోలీసులకు దొరకడం వంటి ఘటనలు రవాణాశాఖ పరువును గాలిలో కలిసేలా చేస్తున్నాయి. ఘోరమైన విషయం ఏంటంటే, ఈ కార్యాలయంలో ఒక అటెండర్‌ను కూడా ట్రాన్స్‌ఫర్‌ చేయడంలో ఉన్నతాధికారులకు ధైర్యం సరిపోవడం లేదు. ఎంపీతో లేఖలు, ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయించుకుంటూ అదే కార్యాలయంలో పాతుకుపోయారు. ఇక ఉన్నతాధికారులు అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నామంటూ పేపర్‌ టైగర్లుగా ఉండటం తప్ప, రవాణాశాఖ ఇమేజ్‌ను కాపాడే ప్రయత్నం చిత్తశుద్ధితో జరగడం లేదనే విమర్శలున్నాయి. ఓవర్‌లోడింగ్‌పై కేసులు నమోదు చేయకుండా కాసులు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోకుండా వారిని ఉన్నతాధికారులు వెనకేసుకొస్తున్నారు. విధులు సరిగ్గా నిర్వహించకపోయినా, ప్రభుత్వ ఖజానాకు నష్టం తెస్తున్నా చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారో అర్థం కావడం లేదు. తప్పులు చేస్తున్నవారిని వెనుకేసుకురావడంలో మర్మమేంటో అవగతం కావడం లేదు.

Spread the love

Related News

Latest News