జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం..
రాష్ట్ర స్థాయి పోటీలకు జీల రక్షిత ఎంపిక
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 26: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన మాక్ పార్లమెంట్ పోటీల్లో అక్కెనపల్లిలోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, విద్యార్థిని జీల రక్షిత ప్రతిభ చాటింది. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. రక్షిత సాధించిన ఈ విజయం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆనందాన్ని నింపింది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంచింది. సభా నిర్వహణ, చర్చలు, ప్రజా సమస్యలపై అభిప్రాయ వ్యక్తీకరణ, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో రక్షిత తన ప్రతిభను చాటుకుంది. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రమేశ్ రక్షితను అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థిని సాధించిన విజయంపై పాఠశాల ప్రిన్సిపాల్ మంద జానయ్య, సీనియర్ అధ్యాపకులు డా.ఎస్. శ్రీనివాస్, సోషల్ విభాగం అధ్యాపకులు ఏ. శ్రీనివాస్, కె.రవీందర్ రెడ్డి, ఎం. శ్రీనివాస్, సి.హెచ్. రజని, నర్సయ్య, ప్రభాకర్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మంద జానయ్య మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి పోటీల్లో పాల్గొనడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రక్షిత ఇదే ఉత్సాహంతో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రక్షిత సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకాంక్షించారు.






























