ప్రతిపక్షం, జూలై 28: దివ్యాంగ యువకుడి చిరకాల కోరికను నెరవేర్చి మల్కాజ్‌గిరి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీస్ అధికారి కావాలన్న రాహుల్ అనే యువకుడి కలను నిజం చేస్తూ మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి అతనికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించారు.
హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించిన కమిషనర్ సుమతి రాహుల్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం తన కార్యాలయంలోకి తీసుకెళ్లి కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టి, కొద్దిసేపు పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అనుభూతిని కల్పించారు.
ఈ సందర్భంగా రాహుల్‌కు పోలీస్ టోపీని బహూకరించిన సీపీ సుమతి, అతనితో ఆప్యాయంగా మాట్లాడి అతని కలలు, ఆశయాల గురించి తెలుసుకున్నారు. పోలీస్ యూనిఫామ్‌పై తనకున్న అభిమానాన్ని రాహుల్ వెల్లడించగా, అక్కడి అధికారులు అతడిని అభినందిస్తూ మరింత ప్రోత్సహించారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంతో రాహుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతని కుటుంబ సభ్యులు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో మల్కాజ్‌గిరి పోలీసులు చట్ట అమలుతో పాటు మానవత్వం, కరుణ, ప్రజాసేవ పట్ల తమ నిబద్ధతను మరోసారి చాటుకున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.

















