ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రోటోకాల్ పాటించాలి

ప్రధాని మోదీ, ఎంపీ రఘునందన్ రావు ఫొటోలు ఏర్పాటు చేయాలి

  • భైరి శంకర్ ముదిరాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 26: సిద్ధిపేట జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రోటోకాల్ పాటించాలని బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన అదనపు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భైరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని చెప్పారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఫొటోలను ఏర్పాటు చేసి ప్రోటోకాల్‌ను పాటించాలని అధికారులను కోరారు. కేంద్ర ప్రభుత్వ పాత్రను ప్రతిబింబించేలా కొనుగోలు కేంద్రాల్లో తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News