విషాదం.. భారత పారా అథ్లెట్‌ నీరజ్‌ యాదవ్‌ ఆత్మహత్య

ప్రతిపక్షం, అక్టోబర్ 28: భారత క్రీడారంగంలో విషాదం చోటుచేసుకుంది. భారత పారా అథ్లెట్‌ నీరజ్‌ యాదవ్‌ (42) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నీరజ్‌ మరణవార్తతో క్రీడా వర్గాల్లో విషాదం నెలకొంది. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నీరజ్‌ యాదవ్‌ పారా అథ్లెటిక్స్‌లో జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రో, షాట్‌పుట్‌ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్న ఆయన, ఆసియా పారా క్రీడల్లో విశేష విజయాలు సాధించారు. 2018, 2023 సంవత్సరాల్లో జరిగిన ఆసియా పారా క్రీడల్లో కలిపి మూడు బంగారు పతకాలు గెలుచుకుని దేశానికి గుర్తింపు తీసుకొచ్చారు. పారా అథ్లెటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నీరజ్‌ మరణం క్రీడాభిమానులను కలచివేసింది.

అయితే ఈ ఏడాది జరిగిన ఆసియా పారా క్రీడల్లో ఆయన పాల్గొనలేదు. డోపింగ్‌ పరీక్షల్లో పట్టుబడటంతో పోటీలకు దూరమైనట్లు సమాచారం. ఈ పరిణామం తర్వాత ఆయన జీవితంలో చోటుచేసుకున్న పరిస్థితులపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ, ఆత్మహత్యకు ఇదే కారణమని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి నిర్ధారిత సమాచారం లేదు. నీరజ్‌ మరణానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు, ఘటనకు ముందు ఏం జరిగిందనే అంశాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News