*రాచకొండ గుట్టల్లో రిజర్వాయర్ నిర్మించి నారాయణపురం, చౌటుప్పల్ కు సాగునీరు ఇవ్వాలి.
*రాజకీయాలు వద్దు.. రైతుకు నీళ్లివ్వండి! – శివన్నగూడ ప్రాజెక్టు వద్ద బీజేపీ హెచ్చరిక.
*దిండి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులవి ద్వంద్వ విధానాలు.
*శివన్నగూడ నుండి రాచకొండ వరకు ఎత్తిపోతల పథకం – బీజేపీ నయా ప్రతిపాదన.
ప్రతిపక్షం మర్రిగూడ , అక్టోబర్ 28: మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల రైతులకు తక్షణమే సాగునీరు అందించేందుకు పెండింగ్‌లో ఉన్న శివన్నగూడెం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల బీజేపీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన శివన్నగూడెం ప్రాజెక్టును సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా డా. నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలాల రైతాంగాన్ని ఆదుకునేందుకు రాచకొండ గుట్టల్లో నూతన రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. శివన్నగూడెం ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల (లిఫ్ట్) ద్వారా ప్రతిపాదిత రాచకొండ రిజర్వాయర్‌కు నీటిని తరలించి, అక్కడ నుండి గొలుసుకట్టు చెరువులను నింపేలా ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. తద్వారా ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు శాశ్వతంగా సాగునీటి సౌకర్యం కల్పించవచ్చని సూచించారు.
*కాంగ్రెస్ పార్టీవి ద్వంద్వ విధానాలు:
దిండి ప్రాజెక్టు విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై వర్షిత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక రకంగా మాట్లాడుతుంటే.. స్థానిక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల పరస్పర విరుద్ధ వైఖరి వారి ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ఆరోపించారు. రైతులకు కావాల్సింది కేవలం కాగితాల మీద ప్రకటనలు కావని, పొలాలకు నీరిచ్చే ప్రాజెక్టుల పూర్తి మాత్రమేనని స్పష్టం చేశారు.జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి రైతుల సాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తికి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. రైతులకు సాగునీరు అందించడం రాజకీయాలకు అతీతమైన బాధ్యత అని, మునుగోడు, దేవరకొండ ప్రాంత రైతాంగానికి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మునుగోడు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

































