హత్యలకు ముందు వీడియో రికార్డ్ చేసిన రాజ్‌కుమార్.. కేసులో కీలక వివరాలు వెల్లడి

ప్రతిపక్షం, జూలై 13: షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరుగురు హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ హత్యలకు పాల్పడే ముందు ఓ వీడియో రికార్డ్ చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. రాజ్‌కుమార్ మృతదేహం వద్ద లభించిన మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, జూలై 10 సాయంత్రం 4:55 గంటలకు అతడు ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.

ఆ వీడియోలో తన సంపాదనలో సగం మొత్తాన్ని బాధిత కుటుంబానికే ఖర్చు చేశానని, తన వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి తనను తీవ్ర నష్టాల్లోకి నెట్టారని రాజ్‌కుమార్ పేర్కొన్నట్లు సీపీ తెలిపారు. తన పిల్లలకు ఆస్తి కూడా లేకుండా చేసుకున్నానని, ఓ అమ్మాయిని నమ్మి అప్పుల పాలయ్యానని, చివరకు తనపై కేసు పెట్టి జైలుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని వీడియోలో చెప్పినట్లు వెల్లడించారు.

అయితే వీడియోలో చేసిన వ్యాఖ్యలు రాజ్‌కుమార్ వ్యక్తిగత వాదనలు మాత్రమేనని, వాటిని విచారణలో భాగంగా పరిశీలిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు మరియు ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీపీ తరుణ్ జోషి తెలిపారు.

Spread the love

Related News

Latest News