ప్రతిపక్షం, జూలై 16: తన కుమారుడు భరత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు, డ్రగ్స్ కేసులో అరెస్టయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
ఈరోజు ఉదయం మంగళ్‌హాట్ పోలీసులు తమ ఇంటికి వచ్చి డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా కొన్ని వివరాలు అడిగారని తెలిపారు. విచారణకు సహకరించాలని పోలీసులు కోరినట్లు చెప్పారు. కామన్ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్ల జాబితాలోని ఎవరో వ్యక్తికి సంబంధించిన సమాచారంతో తమ కుమారుడిని పోలీసులు ప్రశ్నించినట్లు వివరించారు.
అయితే విచారణ అనంతరం తన కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టమైందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. భరత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.

















