సిరిసిల్ల, ప్రతిపక్షం, జూలై 29: నెరేళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న గ్రామస్తులపై జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ఘటన జరిగి దాదాపు తొమ్మిదేళ్లు గడిచినా బాధ్యులైన పోలీసులపై, ఘటనకు కారణమైన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ఆమె విమర్శించారు.
నెరేళ్ల ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఇటీవల మరణించిన గంధం గోపాల్ కుటుంబాన్ని కవిత పరామర్శించారు. అనంతరం బాధితుడు బానయ్య నివాసంలో హరీశ్‌తో పాటు ఇతర బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, గతంలో జరిగిన ఈ ఘటన సమయంలో పాలక వ్యవస్థలో భాగంగా ఉన్నందుకు తాను ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు.
బాధితులను పరామర్శించడం మాత్రమే కాకుండా వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. గోపాల్ కుటుంబంతో పాటు నెరేళ్ల బాధితులందరికీ ప్రభుత్వం రూ.1 కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
బాధ్యులపై ఎందుకు చర్యలు లేవు?
ఇసుక అక్రమ రవాణా కోసం అమాయకుల ప్రాణాలు బలయ్యాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన గ్రామస్తులను ఐదు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసినా, ఇప్పటి వరకు ఒక్క పోలీసు అధికారిపైనా కఠిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మానవ హక్కుల కమిషన్ సూచనలు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు.
రేవంత్, బండి సంజయ్, కేటీఆర్‌ను ప్రశ్నించిన కవిత
నెరేళ్ల ఘటనను రాజకీయంగా ప్రస్తావించి అధికారంలోకి వచ్చిన నాయకులు ఇప్పుడు బాధితులను ఎందుకు పట్టించుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌లు ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నెరేళ్ల బాధితుల కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి మానవత్వంతో ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
బాధితులకు అండగా ఉంటాం
తెలంగాణ రక్షణ సేన బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు. అవసరమైతే జాతీయ ఎస్సీ కమిషన్ నివేదిక కోసం బాధితులతో కలిసి ఢిల్లీ వరకు వెళ్లి పోరాడతామని తెలిపారు. పోలీసుల దాష్టీకానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆమె అన్నారు. నెరేళ్ల బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.






















