ఆగిపోయిన రూ.300 కోట్ల పనులు!
మూడేళ్లలో ఒక్క కొత్త రోడ్డు మంజూరు కాలేదు
పాత పనులూ రద్దు చేశారని హరీశ్ ఆగ్రహం
పెండింగ్ పనులు వేగవంతం చేయాలి
రూ.50 కోట్ల హ్యామ్ రోడ్ల పనులు వెంటనే ప్రారంభించాలి
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట అక్టోబరు 28: సిద్ధిపేట నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సుమారు రూ.300 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను రద్దు చేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త పనులకు మంజూరు ఇవ్వలేదని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారుతున్నా పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. పెండింగ్ పనులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలోని పంచాయతీ రాజ్ ఇంజనీర్ కార్యాలయంలో మంగళ వారం నియోజకవర్గ అభివృద్ధి పనులపై హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా మంజూరైన పనులు, వాటి ప్రస్తుత స్థితి, పెండింగ్‌కు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన అనేక పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. కొత్త పనులు మంజూరు చేయకపోగా, గతంలో మంజూరైన పనులను కూడా రద్దు చేశారని విమర్శించారు. మూడేళ్లుగా నియోజక వర్గంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు ప్రజల రోజువారీ ప్రయాణాలకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు రోడ్లపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. ప్రజలకు నేరుగా ఉపయోగ పడే పనులను నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు స్పష్టం చేశారు.
బీటీ, సీసీ రోడ్ల పనులు వెంటనే చేపట్టాలి
నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న బీటీ రోడ్లు, సీసీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని హరీశ్ రావు సూచించారు. మంజూరైన పనులకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసి, క్షేత్ర స్థాయిలో పనులు జరిగేలా చూడాలన్నారు.సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ పరిధిలోని రహదారుల పనులపైనా సమీక్ష నిర్వహించారు. రంగాయి పల్లి, మాచాపూర్, బద్దిపడగ, జేపీ తండా, రాజగోపాలపేట, ఓబులాపూర్, అక్కెననపల్లి, సిద్ధన్నపేట, రాంపూర్, చర్ల అంకిరెడ్డి పల్లి, ఎల్లాయిపల్లి, విఠలాపూర్ గ్రామాల రహదారి పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అక్కెనపల్లి పెద్దమ్మ దేవాలయం రహదారి, కోదండరావు పల్లి నుంచి లక్ష్మీదేవి పల్లి వరకు రహదారి, మందపల్లి ముండ్రాయి బీటీ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మంజూరైన పనుల్లో జాప్యానికి కారణాలను గుర్తించి, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.
గ్రామీణ మౌలిక వసతులకు ప్రాధాన్యం
రోడ్లతో పాటు గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనపై హరీశ్ రావు దృష్టి సారించారు. గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా భవనాలు, అంగన్ వాడీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఇతర నిర్మాణ పనులను కూడా త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే భవనాలు నిర్మాణం పూర్తికాక పోవడంతో వాటి ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మహిళల కోసం నిర్మిస్తున్న భవనాలు, అంగన్ వాడీ కేంద్రాలు, గ్రామస్థాయి కమ్యూనిటీ భవనాలు స్థానిక ప్రజలకు ఎంతో అవసరమని తెలిపారు. వీటి నిర్మాణంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
రూ.50 కోట్ల హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభం ఎప్పుడు?
సిద్ధిపేట నియోజకవర్గంలో రూ.50 కోట్ల వ్యయంతో మంజూరైన హ్యామ్ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని హరీశ్ రావు అధికారులకు సూచించారు. ఈ రహదారుల పనులు ఆలస్యం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెద్దలింగారెడ్డిపల్లి, అంకం పేట మీదుగా బచ్చాయి పల్లి, అంకం పేట రహదారి, నారాయణరావు పేట,బంజేరుపల్లి, లక్ష్మీదేవి పల్లి, కోదండరావుపల్లి ఎస్సీ కాలనీ, నారాయణ రావు పేట వరకు రహదారి పనులను త్వరగా చేపట్టాలన్నారు. మల్యాల పెద్దలింగారెడ్డిపల్లి, ఎల్లాయి పల్లి నుంచి విఠలా పూర్, మెట్టుపల్లి,సలేంద్రి రహదారి, ఖాతా నుంచి అక్కెనపల్లి, నంగునూరు నుంచి అంక్షాపూర్, నర్మెట్ట నుంచి తిమ్మాయిపల్లి రహదారుల పనులపై సమీక్షించారు. మగ్దుంపూర్ నుంచి బద్దిపడగ, బూరుగు పల్లి నుంచి మిట్టపల్లి, గోనపల్లి, మందపల్లి రహదారి, ఎల్లుపల్లి నుంచి బక్రీచెప్యాల, మిట్టపల్లి, బొగ్గులోని బండ రోడ్డు మాచాపూర్–శంకర్‌నగర్, గుండ్లచెరువు–నర్సాపూర్ రహదారుల పనులు, మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో పనులు చేయండి
కార్యాలయాలకు పరిమితం కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని హరీశ్ రావు సూచించారు. గ్రామాల్లో రహదారుల పరిస్థితిని పరిశీలించాలని, పెండింగ్ పనులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించాలని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని తెలిపారు. నిధులు, అనుమతులు, ఇతర పరిపాలనా సమస్యల కారణంగా పనులు నిలిచిపోతే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.మంజూరైన పనులు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించాలని స్పష్టం చేశారు. ప్రతి పనికి సంబంధించిన పురోగతిని పర్యవేక్షించాలని అన్నారు. పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
గ్రామీణ రహదారులు, భవనాల నిర్మాణం ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. రోడ్ల పనులు ఆలస్యం కావడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కోరారు. సిద్ధిపేట నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై అధికారుల సమీక్షతో పాటు, వాటి పురోగతిపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.





























