*మునుగోడు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ – సిబ్బందికి కీలక ఆదేశాలు.
*ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – పెండింగ్ కేసులు పరిష్కరించాలి.
*రాత్రి పెట్రోలింగ్ పెంచండి – రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి.
*గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి, మహిళా భద్రత, సైబర్ అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలి.
*స్టేషన్ రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ.
ప్రతిపక్షం – మునుగోడు, అక్టోబర్ 28: నేరాల నియంత్రణకు కేవలం కేసు నమోదు చేస్తే సరిపోదని, ముందస్తు చర్యలు, నిఘా, ప్రజలతో సత్సంబంధాలతోనే శాంతిభద్రతలను కాపాడగలమని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మునుగోడు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా స్టేషన్ ఆవరణ, పరిశుభ్రత, రిసెప్షన్ కౌంటర్ పనితీరును పరిశీలించారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేశారు.అనంతరం స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. క్రైమ్ రిజిస్టర్లు, కేసు డైరీలు, రౌడీషీట్లు, హిస్టరీషీట్లు, పెండింగ్ కేసుల వివరాలు, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దర్యాప్తులో జాప్యం లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో సాక్ష్యాధారాలు సేకరించి నిర్ణీత గడువులో చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
*ప్రజా ఫిర్యాదులకు ఫస్ట్ ప్రయారిటీ:
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి బాధితుడి ఫిర్యాదును ఓపికగా వినాలని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, చట్టప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు పోలీసులను ఆశ్రయించేలా నమ్మకాన్ని పెంపొందించాలన్నారు.
*గ్రామీణ భద్రతపై ప్రత్యేక దృష్టి:
గ్రామాల్లో బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. బీట్ కానిస్టేబుల్ ప్రతిరోజూ గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలి. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి. పాత నేరస్తులు, రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
*మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం:
ఇటీవల పెరుగుతున్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, యువత పెడదోవ పట్టకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
*మహిళా భద్రత – సైబర్ నేరాలు:
మహిళలు, బాలికల భద్రత విషయంలో రాజీపడవద్దని, షీ టీమ్స్ నిఘాను పెంచాలని చెప్పారు. పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, మహిళలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం తీసుకురావాలని సూచించారు.
నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ తనిఖీ కార్యక్రమంలో చండూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాము, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, మునుగోడు ఎస్ఐ శోభన్ బాబు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.





























